Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరు ఆఫీస్‌కు వెళ్తున్నారా?.. వర్షాకాలంలో ఈ 8 ప్రమాదకర ఇన్ఫెక్షన్ల ప‌ట్ల తస్మాత్ జాగ్రత్త!

Are you going to the office Beware of these 8 dangerous infections in the rainy season
Advertisement
  • వర్షాకాలంలో ఆఫీసుల్లో వేగంగా వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్లు
  • ఫ్లూ, కండ్లకలక, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి 8 వ్యాధులపై హెచ్చరిక
  • ఆఫీసుల్లో పరిశుభ్రత లోపించడం, తడి బట్టలు ప్రధాన కారణాలు
  • జబ్బుగా ఉన్నప్పుడు ఆఫీసులకు వెళ్లకపోవడమే శ్రేయస్కరం
  • తరచూ చేతులు కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం
Advertisement
వర్షాకాలంలో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఈ సీజన్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పరిమితమైన ప్రదేశాల్లో ఎక్కువ మంది పనిచేయడం, వెంటిలేషన్ సరిగా లేకపోవడం, తేమతో కూడిన వాతావరణం, తడి బట్టలు, బూట్లు వంటి కారణాల వల్ల కార్యాలయాల్లో ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఆఫీసుల్లో ప్రబలే 8 ప్రధాన వ్యాధులు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలను ఆరోగ్య నిపుణులు వివ‌రించారు.

కార్యాలయాల్లో వ్యాపించే ప్రధాన 8 ఇన్ఫెక్షన్లు:

1. ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ): గాలి తక్కువగా ఉండే మీటింగ్ రూమ్‌లు, ఎలివేటర్లలో దగ్గడం, తుమ్మడం వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల హఠాత్తుగా జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

2. కోవిడ్-19: ఈ వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఫ్లూ మాదిరిగానే శ్వాసకోశ సమస్యలతో ఇది కూడా సీజనల్‌గా వ్యాప్తి చెందుతోంది.

3. వైరల్ కండ్లకలక (పింక్ ఐ): వైరస్ సోకిన వస్తువులను తాకి, అవే చేతులతో కళ్లను తాకడం వల్ల ఈ సమస్య వస్తుంది. కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, దురద వంటివి దీని ప్రధాన లక్షణాలు.

4. వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్: ఆఫీస్ ప్యాంట్రీలలో కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా ఇది వ్యాపిస్తుంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి దీని లక్షణాలు.

5. సాధారణ జలుబు: గాలిలోని తుంపర్ల ద్వారా, ఒకరినొకరు తాకడం ద్వారా ఇది అత్యంత వేగంగా వ్యాపించే సాధారణ సమస్య.

6. ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు: తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో, తడి బూట్లు, సాక్సుల వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. దురద, తామర వంటివి దీని లక్షణాలు.

7. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్: ఇది ఎక్కువగా పిల్లలలో కనిపించినా, పెద్దవారిలో కూడా వచ్చే అవకాశం ఉంది. జ్వరం, నోటిలో పుండ్లు, చేతులు, పాదాలపై దద్దుర్లు దీని లక్షణాలు.

8. లెప్టోస్పిరోసిస్: ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. కానీ, వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ముప్పు ఉంటుంది. జంతువుల మూత్రంతో కలుషితమైన నీటి ద్వారా ఇది సోకుతుంది. తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పి, కామెర్లు దీని లక్షణాలు.

వ్యాప్తికి కారణాలు, నివారణ చర్యలు:
భారత్‌లో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ కింద 2021 నుంచి 2025 మధ్య నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల కేసులు 17 మిలియన్లకు పైగా నమోదయ్యాయి. ఆఫీసుల్లో డెస్క్‌ల వద్దే భోజనం చేయడం, ఒకరి వస్తువులు మరొకరు వాడటం, జబ్బుగా ఉన్నప్పటికీ ఆఫీసుకు రావడం వంటి అలవాట్ల వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం మరింత పెరుగుతోంది.

దీనిని నివారించడానికి కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడటం తప్పనిసరి. పనిచేసే ప్రదేశాన్ని, కంప్యూటర్, ఫోన్ వంటి పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. జ్వరం లేదా ఇతర ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. ఆఫీసులో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. తడి బూట్లు, సాక్సులను వెంటనే ఆరబెట్టాలి. ఇతరుల వ్యక్తిగత వస్తువులను వాడకుండా ఉండాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వీలైతే ఏటా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement
Monsoon Infections
Office Employees
Health Precautions
Seasonal Flu
Workplace Hygiene
Rainy Season Diseases

More Telugu News